: వెంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో ఎన్టీఆర్ చూపించారు: ముఖ్యమంత్రి చంద్రబాబు
వెంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో దివంగత నందమూరి తారక రామారావు మనకు చూపించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో పర్యటిస్తోన్న ఆయన ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ ఒక మనిషికాదు ఒక వ్యవస్థ అని అన్నారు. ఆయన సినిమాల్లో ఎన్నో వేషాలు వేశారని, రాజకీయాల్లోనూ చక్రం తిప్పారని కొనియాడారు. కాంగ్రెస్‌ను ఎన్టీఆర్ ఎదుర్కొన్న తీరు అద్భుతమని చంద్రబాబు అన్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్టీఆర్ కారణమయ్యారని ఆయన అన్నారు. ‘ఎన్టీఆర్ నిమ్మకూరులో మామూలు కుటుంబంలో పుట్టారు. ఆయన పడిన శ్రమ, కృషి ఆయనను ఓ గొప్ప వ్యక్తిగా నిలబెట్టాయి. అందరి దేవుళ్ల రూపం ఆయనలో చూసుకున్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో అమరావతిలో ఎంతో విశ్వాసంతో ముందుకు వెళదాం. నేను ఎన్టీఆర్‌తో పనిచేయడం వల్ల ఆయన నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాను. చాలా మంది మాటలు మాత్రమే చెబుతారు.. కానీ, పాటించరు. ఎన్టీఆర్ ఏది చెబుతారో అదే పాటిస్తారు. తిండి, బట్ట, ఇల్లు ముఖ్యమని భావించి పేదలకు వాటిని అందించడానికి ఎంతో కృషి చేశారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ చేసిన దుర్మార్గమైన చర్యతో కట్టుబట్టలతో వచ్చాం. ఎన్టీఆర్ ఇచ్చిన మనోధైర్యంతో ముందుకు వెళదాం. మనకు అన్యాయం చేసిన వారి గుండెల్లో నిద్రపోదాం. అభివృద్ధి చేసి చూపిద్దాం. నేను ఏ పని చేసినా పేదవాళ్లని దృష్టిలో పెట్టుకొని చేస్తా. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ ఇంటి పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పాను. అలాగే ఉంటాను’ అని చంద్రబాబు అన్నారు.