: హీరో దర్శన్ ఇల్లు కూల్చేందుకు వారం గడువు
కన్నడ స్టార్ హీరో దర్శన్ కు బెంగళూరు అర్బన్ జిల్లా అధికారులు తుది హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని రాజరాజేశ్వరి నగర్ లోని రాజకాలువపై అక్రమంగా నిర్మించుకున్న ఇంటిని సొంతంగా తొలగించుకోవాలని... లేకపోతే అక్టోబర్ 22న ఇంటిని తామే కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దర్శన్ ఇంటితో పాటు మాజీ మంత్రి శ్యామనూరు శివశంకరప్పకు చెందిన హాస్పిటల్ కు కూడా ఇదే హెచ్చరికలు జారీ చేశారు. వీటితో పాటు కాలువపై, కాలువ సమీపంలో అక్రమంగా నిర్మించుకున్న మరో 67 కట్టడాలను కూడా జిల్లా అధికారులు కూల్చివేయనున్నారు. రెండు నెలల క్రితం జరిపిన ఓ సర్వేలో... కాలువను కబ్జా చేసి ఐడియల్ హోమ్స్ లేఔట్ వేసిందనే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కబ్జా వల్ల చిన్నపాటి వర్షాలకే ఆ ప్రాంతంలో వరదలు వస్తున్నాయని సర్వే తెలిపింది. దీంతో, రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం... కాలువపై నిర్మించిన అక్రమ నిర్మాణాల నిర్మూలనకు నడుం బిగించింది. హై ప్రొఫైల్ ఉన్నవారి నివాసాలను కూడా కూల్చి వేస్తామంటూ నోటీసులు జారీ చేసింది.