: మాజీ ప్రియురాలిపై అత్యాచారం కేసులో భారత హాకీ కెప్టెన్ కు ఊరట
మాజీ ప్రియురాలిపై అత్యాచారం చేశాడన్న కేసులో భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ కు ఊరట లభించింది. కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే, ట్రయల్ కోర్టు విచారణకు ఆదేశించిందని... ఈ కారణంగా విచారణపై స్టే విధించాలని కోరుతూ సర్దార్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు వివరాల్లోకి వెళ్తే, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై సర్దార్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఇంగ్లండ్ కు చెందిన అండర్ 19 హాకీ మాజీ ప్లేయర్ అష్పాల్ కౌర్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్సువల్ హరాస్ మెంట్, శారీరకంగా, మానసికంగా హింసించడంలాంటి ఆరోపణలను ఫిర్యాదులో ఆమె పేర్కొంది. 2012 ఒలింపిక్స్ సమయంలో తమకు పరిచయం ఏర్పడిందని... ఆ తర్వాత శారీరక బంధానికి దారితీసిందని తెలిపింది. ఆ తర్వాత, తాను ఫిర్యాదు చేసినప్పటికీ, సర్దార్ పై పోలీసులు ఎఐఆర్ కూడా నమోదు చేయలేదని, కేసు విచారణలో తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ ట్రయల్ కోర్టులో కేసు వేసింది. దీంతో, విచారణ జరపాలంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ట్రయల్ కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. జనవరి 6వ తేదీ లోగా సర్దార్ పిటిషన్ కు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ అష్పాల్ కౌర్ కు నోటీసులు జారీ చేసింది.