: అనుకూలించని వాతావరణం.. భారత్ కు ఆలస్యంగా చేరుకుంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్


గోవాలో జ‌రుగుతున్న రెండురోజుల‌ బ్రిక్స్ సమాఖ్య (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సులో పాల్గొన‌డానికి బ్రెజిల్ అధ్య‌క్షుడు మైఖేల్ టీమ‌ర్‌, సౌతాఫ్రికా అధ్య‌క్షుడు జాక‌బ్ జుమాలు ఇప్ప‌టికే భార‌త్ చేరుకున్న విష‌యం తెలిసిందే. అయితే, షెడ్యూల్ ప్ర‌కారం ఇప్ప‌టికే గోవా చేరుకోవాల్సిన‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశానికి ఆల‌స్యంగా రానున్నారు. వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డ‌మే దానికి కార‌ణం. దట్టమైన పొగమంచు కార‌ణంగా విమానం గోవాలో ల్యాండ్ అవడానికి అంతరాయం ఏర్పడింది. దాబోలిమ్ విమానాశ్రయం ప్రక్కన ఉన్న ఐఎన్ఎస్ హన్సా బేస్కు పుతిన్ రాత్రి 1 గంటకే చేరుకోవాల్సి ఉండ‌గా ప్ర‌తికూల వాతావ‌ర‌ణంతో ఆయ‌న రాక‌ ఆలస్యమ‌వుతున్న‌ట్లు నావెల్ బేస్ పేర్కొంది. అయితే, రెండు గంట‌లు మాత్ర‌మే ఆల‌స్య‌మై విమానం తెల్ల‌వారు జామున‌ మూడు గంటలకు ల్యాండ్ అవుతుందని అనుకున్నారు. ఆ సమయానికి కూడా విమానం చేరుకోలేదు. దీంతో మరోసారి ఆయ‌న రాక‌కు రీషెడ్యూల్ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ర‌ష్యా అధ్య‌క్షుడి విమానాన్ని ఎక్కడికీ మ‌ళ్లించారో ప్ర‌క‌టించ‌లేదు. రష్యా అధ్యక్షుడుకి స్వాగ‌తం ప‌ల‌క‌డానికి పలువురు కేంద్రమంత్రులు, గోవా అధికార ప్రతినిధులు బేస్ వ‌ద్ద‌ నిన్న‌ రాత్రి క్యాంపెయిన్ నిర్వహించారు. గోవా బ్రిక్స్‌ సమావేశ ప్రాంగ‌ణం, ప‌రిస‌ర ప్రాంతాలు, మార్గాల్లో పెద్ద‌ ఎత్తున భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News