: ట్రంప్ నా వెంట కూడా పడ్డారు.. హిల్లరీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు డిబేట్లలో హిల్లరీ కంటే ట్రంప్ వెనకబడిపోయారు. ట్రంప్ గత వ్యవహారం గురించి వెలుగుచూస్తున్న వీడియో టేపులు తాజాగా వివాదాస్పదమవుతున్నాయి. మహిళలపై ఆయన వ్యవహరించిన తీరుతో సర్వత్ర విమర్శల పాలవుతున్నారు. ట్రంప్ బారిన పడిన ఎందరో మహిళలు మీడియాకు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హిల్లరీ క్లింటన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ట్రంప్ బాధితురాలినేనని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఓ టీవీ చానల్ చర్చాగోష్టిలో పాల్గొన్న హిల్లరీ మాట్లాడుతూ.. ప్రేమోన్మాదిగా మారిన ట్రంప్ తన వెంట కూడా పడ్డారని, మీదిమీదికొచ్చారని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఆరోపణలు నిరాధారమని, తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకే ఆమె ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ అన్నారు.