: ఆధునిక ఆయుధాలతోనే విజయం సాధ్యమంటే అది భ్రమే.. మనం ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదు: మోదీ
మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో లక్షన్నర మంది భారతీయ సైనికులు పాల్గొన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో శౌర్య సమ్మాన్ సభలో పాల్గొన్న మోదీ అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. ఆధునిక ఆయుధాలతోనే సైన్యం విజయం సాధిస్తుందంటే అది భ్రమ మాత్రమేనని ఆయన అన్నారు. విజయం సాధించాలంటే అందుకు మనోబలం కూడా కావాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి శాంతి దళాల్లో సుదీర్ఘకాలంగా మన దేశం సేవలందిస్తోందని చెప్పారు. మన జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని ఆయన అన్నారు. క్రమశిక్షణలో మన ఆర్మీకి ప్రపంచంలోనే గొప్ప పేరు ఉందని కొనియాడారు. దేశ రక్షణ కోసం జవాన్లు ప్రాణాలు త్యాగం చేస్తున్నారని, మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అది సైనికులు చేస్తోన్న సేవల ఫలితంగానేనని ఆయన అన్నారు.