: ఈబేలో అమ్మకానికి చిన్నారి...నెటిజన్ల ఆగ్రహం
'ఈబే'లో ఓ చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఘటన నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. జర్మనీలోని డ్యూస్ బెర్గ్ లో 40 రోజుల చిన్నారిని ఈ కామర్స్ సంస్థ ఈబేలో అమ్మకానికి పెట్టారు. నైట్ సూట్ లో ఉన్న పాపకు 4,510 పౌండ్లు (3,67,776.87 రూపాయలు) ధరగా నిర్ణయించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఈబే నుంచి ఆ యాడ్ ను తొలగించారు. దానిని ఎవరు పెట్టారన్న దానిపై తమకు స్పష్టత లేదని ఈబే తెలిపింది. ఇందులో వాస్తవమెంత? అన్నది తమకు తెలియకపోయినా, వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో దానిని తీసేసినట్టు ఈబే ప్రకటించింది. వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.