: తల్లయినా, చెల్లయినా, భార్యే అయినా ఒకటే... పట్టుబడ్డ ఐఎస్ఐఎస్ ఉగ్రవాది దారుణ వ్యాఖ్యలు


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎంత దారుణమైన రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తారో, ఎంత క్రూరమైన మనోభావాలను కలిగివుంటారో చెబుతోందీ ఇంటర్వ్యూ. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిగా ఉంటూ, స్లీపర్ సెల్స్ ను నియమించేందుకు వెళ్లిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు నాలుగు నెలల క్రితం అరెస్ట్ చేయగా, ఇటీవల చేసిన ఇంటర్వ్యూ వివరాలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. దీనిలో మహిళలను వారెలా చూసేది, వారి పట్ల ఎంత అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తించేదీ అతని మాటల్లోనే చెప్పింది. కట్టుకున్న భార్య అయినా, కన్న తల్లి అయినా, తోడ బుట్టిన చెల్లెలైనా, ఇస్లామిక్ చట్టం మాత్రమే వర్తిస్తుందని, లైంగిక బానిసలుగా పడుండాల్సిందేనని చెప్పాడా దుర్మార్గుడు. తన భార్య ఎప్పుడూ బురఖా ధరించే ఉంటుందని, తాను లేకుండా బయటకు వెళ్లడం నిషేధమని చెప్పిన ఈ ఉగ్రవాది, తాను అరెస్ట్ అయి నాలుగు నెలలు దాటిన కారణంగా, ఆమెను ఇంకెవరైనా వివాహం చేసుకోవచ్చని, ఆమె ఉన్నదే పిల్లల్ని కనడానికని, జీహాద్ ప్రపంచంలో స్త్రీకి స్వీయ ఇష్టాలు ఉండవని, వారు ప్రాణాలతో మాత్రమే ఉంటారని, నచ్చినట్టు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశాడు. "మీరు బానిసలుగా చూస్తున్న మహిళలల్లో మీ తల్లి లేదా చెల్లి ఉంటే? వారిని సంతల్లో పశువుల్లా అమ్మితే? నీ దగ్గరి స్నేహితుడే నీ భార్యను పెళ్లాడితే?" వంటి ప్రశ్నలు అడిగితే సభ్య సమాజం విస్తుపోయే సమాధానం అతని నోటి వెంట వచ్చింది. సామాజిక న్యాయ వ్యవస్థ లేని షరియత్ పాలనలో, తల్లయినా, చెల్లయినా ఒకటేనని, తాను అటువంటివి పట్టించుకోనని, ఆడవాళ్లంతా దిగువ స్థాయి వారేనని చెప్పాడు. జీహాదీ ప్రపంచంలో యాజిడి మహిళలు విలువైన లైంగిక బానిసలని, వారంతా ఇస్లామిక్ స్టేట్ పెద్దల కోసమే పుట్టారని, వారిని ఎలా కావాలంటే అలా వాడుకుంటామని చెప్పాడు. ఉగ్రవాదుల మనసులో ఎంత ఛాందసవాదతత్వం పెరిగిందో, వారు ప్రపంచానికి ఎంత హానికారులుగా మారారో ఈ ఇంటర్వ్యూ చెప్పకనే చెబుతోంది.

  • Loading...

More Telugu News