: చైనాపై ఒత్తిడితో మసూద్ అజర్ ఆటకట్టించే యోచనలో మోదీ!
పఠాన్ కోట్ ఉగ్రదాడుల సూత్రధారి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు మూడుతోంది. ఎలాగైనా మసూద్ ను ఉగ్రవాదిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలపాలన్న ఆలోచనతో మసూద్ సహా మరో ముగ్గురిపై సీమాంతర ఉగ్రవాదం కింద ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు చేసి విచారణ ప్రారంభించింది. పఠాన్ కోట్ దాడుల కేసు విచారణ ముమ్మరం చేసిన భారత్, గోవాలో జరిగే బ్రిక్స్ దేశాల్లో చైనాపై ఒత్తిడి తేవడం ద్వారా, ఐరాసలో మసూద్ ను ఉగ్రవాదిగా ప్రకటించేలా చూడాలని భావిస్తోంది. మసూద్ కు ఉగ్రవాదులతో సంబంధాలపై చైనాకు పూర్తి వివరాలు అందించాలని ఇప్పటికే నిర్ణయించిన భారత్, ఆయన పర్యటనను ఇందుకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఎంతో కాలంగా పాకిస్థాన్ మసూద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుండగా, సాంకేతికాంశాలంటూ చైనా తన వీటో హక్కుతో మసూద్ ను వెనకేసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో స్వయంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగి చైనా ప్రధాని జిన్ పింగ్ తో చర్చిస్తారని తెలుస్తోంది.