: 'వెన్నులో వణుకు పుడుతోంది': ట్రంప్ పై తొలిసారిగా విరుచుకుపడ్డ మిచెల్ ఒబామా
యూఎస్ ఫస్ట్ లేడీ, అధ్యక్షుడు ఒబామా సతీమణి మిచెల్, రిపబ్లికన్ పార్టీ తరఫున తదుపరి అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై తొలిసారిగా విరుచుకుపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన అశ్లీల, అసభ్యకర వ్యాఖ్యలు ఎంతమాత్రమూ సహించరానివని, అతని మాటలు వింటుంటే తనకే వెన్నులో వణుకు పుడుతోందని, ఇక ఆ సమయంలో అక్కడున్న యువతులు ఎంతటి భయాందోళనలకు గురై ఉంటారో ఊహించుకోవచ్చని ఆమె అన్నారు. అతను రిపబ్లికనా? లేక డెమోక్రాటా? అన్నది తనకు అనవసరమని, ఓ మహిళగా, ఈ తరహా వ్యాఖ్యలు ఎవరు చేసినా తాను ఖండించే తీరుతానని అన్నారు. మహిళల పట్ల అతని ఆలోచనలు ఎలా ఉంటాయన్న విషయానికి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని, తన విమర్శల వెనుక రాజకీయ కోణం లేదని, ఏ అమెరికన్ మహిళైనా, ట్రంప్ మాటలు, వీడియోలు చూస్తే ఇదే మాటంటారని వ్యాఖ్యానించారు. కాగా, గడచిన వారం రోజులుగా, మహిళలతో ట్రంప్ నడుచుకున్న అసభ్య తీరు, చేసిన అశ్లీల వ్యాఖ్యలపై ఎన్నో సంభాషణలు, వీడియోలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై ట్రంప్ క్షమాపణలు చెబుతున్నప్పటికీ, ఏ రోజుకారోజు మరో కొత్త ఆరోపణ, వీడియో వస్తూనే ఉండటం గమనార్హం.