: భారత్‌కు పాక్, చైనా నుంచి ముప్పులేదు.. అంతర్గతంగానే పెను ముప్పు: మాజీ ఎన్ఎస్ఏ శివశంకర్ మీనన్


పాకిస్థాన్, చైనా నుంచి భారత్‌కు ఎటువంటి ముప్పు లేదని, అంతర్గతంగానే దేశానికి పెను ముప్పు పొంచి ఉందని మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, చైనా నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందా? అన్న ప్రశ్నకు మీనన్ బదులిస్తూ దేశానికి బయట నుంచి ఎటువంటి ముప్పు లేదని, దేశంలోని మత, సాంఘిక హింస వల్లే పెను ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని అన్నారు. దేశంలోని వేర్పాటు వాదుల వల్ల ముప్పు పొంచి ఉందని, అయితే అది చాలా కాలం కొనసాగే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం మనం దృష్టి సారించాల్సింది దీనిపైనేనని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం దేశంలో క్రమంగా తగ్గుముఖం పట్టాయని మీనన్ పేర్కొన్నారు. 2012 నుంచి దేశంలో పెరిగింది మత, సాంఘిక హింసేనని పేర్కొన్న మీనన్ వీటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది సంప్రదాయ చట్టాల వల్ల వచ్చిన సమస్య కాదని మీనన్ పేర్కొన్నారు. వీటిని ఎలా అదుపు చేయాలో పోలీసులకు తెలుసన్నారు. సుదీర్ఘకాలం పాటు దౌత్యపరంగా సేవలందించిన మీనన్ 2010 నుంచి మే 2014 వరకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు.

  • Loading...

More Telugu News