: యూరప్ కేంద్రంగా రూ. 1,130 కోట్ల ‘సైబర్ స్కామ్’... పలువురు తెలుగువారికి భాగస్వామ్యం.. తప్పించుకొచ్చిన వారి అరెస్టు కోసం హైదరాబాద్ కు స్కాట్ ల్యాండ్ యార్డ్ పోలీసులు!
లండన్ కేంద్రంగా పాకిస్థాన్ కు చెందిన ఫిజాన్ గ్యాంగు నేతృత్వంలో జరిగిన భారీ సైబర్ స్కామ్ కలకలం రేపుతోంది. న్యాయవాద కంపెనీల ద్వారా కొనుగోళ్ల లావాదేవీలు జరిపే వ్యక్తులే టార్గెట్ గా సుమారు రూ. 1,130 కోట్ల మేరకు ఈ గ్యాంగు దోచుకోగా, ఖమ్మం, రాజమహేంద్రవరం, కరీంనగర్ తదితర ప్రాంతాల యువకులకూ ముఠాలో భాగం ఉంది. వీరిలో కొందరు పారిపోయిరాగా, ఇంటర్ పోల్ భారత సహకారాన్ని కోరడం గమనార్హం. బ్రిటన్ లో ఏదైనా ఆస్తిని విక్రయించాలంటే, దాన్ని ఖరారు చేసేందుకు సొలిసిటర్ కంపెనీలను ఆశ్రయిస్తారు. ఆపై వారు సదరు ఆస్తిని పరిశీలించి లావాదేవీని ఖరారు చేస్తారు. తరువాత ఆ డబ్బు తొలుత సొలిసిటర్ కంపెనీ ఖాతాలోకి, అటునుంచి ఆస్తిని అమ్మిన వ్యక్తి ఖాతాలోకి చేరుతుంది. బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువ కావడంతో అన్ని లావాదేవీలూ రుణంపైనే సాగుతాయి. బ్యాంకులు సైతం న్యాయవాద కంపెనీ ఖాతాలోనే డబ్బు జమ చేస్తుంది. ఈ లొసుగే ఫిజాన్ గ్యాంగుకు వరమైంది. ఇంటర్నెట్ ఆధారిత స్ఫూఫింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి గ్యాంగులోని 20 మంది సభ్యులు కంపెనీలకు కాల్ చేసేవారు. రిసీవ్ చేసుకునే వ్యక్తికి బ్యాంకు నంబరే డిస్‌ప్లే అయ్యేది. ఆపై కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన రెండు లావాదేవీలను చెప్పి వారికి నమ్మకం కలిగించిన తరువాత, వారు చేయని డీల్ గురించి చెప్పేవారు. చెల్లింపు ప్రాసెస్ నడుస్తోందని వివరించేవారు. ఆ లావాదేవీతో తమకు సంబంధం లేదని కంపెనీ చెప్పగా, దాన్ని రద్దు చేయాల్సి వుందని అంటూ, ఓ కోడ్ నంబర్ చెప్పేవారు. బ్యాంక్ ఫ్రాడ్ వింగ్ కు కాల్ చేసి ఈ నంబర్ చెప్పాలని కోరేవారు. ఆపై అసలు దందా మొదలయ్యేది. అధునాతన సాంకేతికత కారణంగా, కంపెనీ ఫోన్ పెట్టేసినా, కాల్ కనెక్టయ్యే ఉండేది. ఆపై సొలిసిటరీ కంపెనీ వాళ్లు బ్యాంక్ ఫ్రాడ్ వింగ్ కు కాల్ చేస్తే, అది నేరగాళ్ల ఫోన్ నంబరుకు వెళ్లేది. తరువాత బ్యాంకు అధికారుల మాదిరిగా మాట్లాడి, డీల్ క్యాన్సిల్ చేయడానికంటూ, యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో పాటు కస్టమర్ నుంచే కార్డ్ రీడర్ జనరేటెడ్ కోడ్ తదితరాలు తీసుకుని క్షణాల్లో డబ్బును ‘మనీ మ్యూల్స్’ ఖాతాల్లోకి మళ్లించేవారు. ఆపై మనీ మ్యూల్స్ నిర్వహించే వ్యక్తులు తమ కమిషన్ తాము తీసుకుని డబ్బును గ్యాంగ్ లీడర్ కు ఇచ్చేవారు. ఈ తరహా మనీ మ్యూల్స్ లో తెలుగువారున్నారు. కొన్ని నెలల వ్యవధిలో 750 కంపెనీల నుంచి రూ.1,130 కోట్ల వరకు ఈ గ్యాంగ్ స్వాహా చేసినట్టు స్కాట్ ల్యాండ్ యార్డ్ పోలీసులు గుర్తించారు. ఫిజాన్ తో పాటు లండన్ లోని అనేక చోట్ల నివాసముంటున్న తెలుగువారిని పట్టుకోగా, కేసు విచారణ ఉన్న సమయంలో ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు పారిపోయి వచ్చేశారు. ఇప్పుడు వీరి కోసం హైదరాబాద్ కు లండన్ పోలీసులు రానున్నట్టు తెలుస్తోంది.