: పీవీ సరళీకృత ఆర్థిక విధానాలే దేశాభివృద్ధికి కారణం.. కొనియాడిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్


మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాలే దేశాభివృద్ధికి కారణమని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగబోతోందని, రెండంకెల ఆర్థికాభివృద్ధి సాధిస్తోందని ఆయన అన్నారు. ప్రధానిగా పీవీ నరసింహారావు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన తీరుపై ప్రముఖ పాత్రికేయుడు సంజయబారు రాసిన ‘1991 హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ పుస్తకంపై గురువారం జరిగిన చర్చాగోష్టిలో రంగరాజన్ మాట్లాడారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టే అవకాశం అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌కు వచ్చినప్పటికీ ఆయన ధైర్యం చేయలేకపోయారన్నారు. దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేసిన హీరో పీవీయేనని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతోపాటు నెహ్రూ విదేశీ విధానాన్ని పీవీ పూర్తిగా మార్చేశారన్నారు. ఆర్థికాభివృద్ధిని, గ్రామీణాభివృద్ధిని ఏక కాలంలో సాధించే ద్విముఖ వ్యూహాన్ని పీవీ అవలంబించారని తెలిపారు. దేశ ఆర్థిక రంగం ముఖచిత్రాన్ని పీవీ సమూలంగా మార్చేశారని పుస్తక రచయిత సంజయ్‌బారు అన్నారు. ఈ పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేసి ఉంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. నెహ్రూ కుటుంబం సుదీర్ఘకాలంలో చేయలేని పనిని పీవీ కేవలం రెండు నెలల కాలంలోనే చేసి చూపించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ కొనియాడారు. తెలంగాణలోని ఫ్యూడలిజాన్ని వ్యతిరేకించిన పీవీ దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ప్రొఫెసర్ హనుమంతరావు అన్నారు.

  • Loading...

More Telugu News