: సిరియా-టర్కీ సరిహద్దులో కారుబాంబు పేలుడు.. 20 మంది దుర్మరణం
సిరియాలోని బాబ్ అల్ సలామా సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన కారుబాంబు పేలుడులో 20 మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది సిరియా రెబల్ ఫైటర్స్ ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉత్తర సిరియాలోని బాబ్ అల్ సలామా క్రాసింగ్‌కు సమీపంలో టర్కీ-సిరియా సరిహద్దు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడులో తీవ్రంగా గాయపడిన మరికొందరిని వెంటనే సమీపంలోని అజాజ్‌లోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల కోసం రక్తదానానికి ముందుకు రావాలని అక్కడి మసీదులు ప్రజలను కోరాయి. తీవ్రంగా గాయపడిన 25 మందిలో విషమంగా ఉన్న 8 మందిని అత్యవసర వైద్య సేవల కోసం సరిహద్దు సమీపంలో ఉన్న టర్కీ ఆస్పత్రులకు తరలించారు. అట్మే సరిహద్దు వద్ద గత వారం జరిగిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందారు. ఆ ఘటనను మర్చిపోకముందే తాజాగా ఈరోజు కారు బాంబు పేలుడుతో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐసిస్ ఉగ్రవాదులు పోరాడుతున్న సంగతి తెలిసిందే.