: వేడెక్కుతున్న ‘ఉమ్మడి పౌరస్మృతి’.. వ్యతిరేకించిన ముస్లిం లా బోర్డు.. మోదీపై విపక్షాలు కారాలుమిరియాలు!


దేశవ్యాప్తంగా వివాహ చట్టంలో ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నట్టు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. భారత్‌లాంటి దేశాలలో ‘ఉమ్మడి’ సాధ్యం కాదని కాంగ్రెస్ పేర్కొనగా, ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి పౌరస్మృతికి చట్ట సవరణలు అవసరమని, దీనిపై చర్చలకు సిద్ధమని కేంద్ర మైనారిటీ శాఖామంత్రి నఖ్వీ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజలు, ప్రజాసంఘాల సూచనల కోసం కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ప్రశ్నావళిని బహిష్కరిస్తున్నట్టు ముస్లిం సంఘాలు పేర్కొన్నాయి. దేశ ప్రజలందరినీ ఒకే గాటన కట్టడం సరికాదని, దీనివల్ల బహుళత్వం, భిన్నత్వాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ముస్లిం లా బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా మహమ్మద్ వలీ రహమనీ పేర్కొన్నారు. మిగతా వారితో పోలిస్తే ముస్లింలలో విడాకులు తీసుకునే వారు చాలా తక్కువన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ‘ఉమ్మడి’ పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ప్రధాని మోదీని విమర్శించారు. ‘ఉమ్మడి’పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటం తప్పదని జమాతే ఉలేమాయీ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని హెచ్చరించారు. ఈ చట్టం వల్ల దేశంతో భిన్నత్వం దెబ్బతింటుందని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చర్చలకు సిద్ధమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రి నఖ్వీ తెలిపారు.

  • Loading...

More Telugu News