: జయలలిత కోసం మళ్లీ వచ్చిన లండన్ వైద్యుడు.. ‘అమ్మ’పై వదంతులతో ఇద్దరు ఆత్మహత్య
గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స చేసేందుకు లండన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణుడు డాక్టర్ జాన్ రిచర్డ్ బీలే మళ్లీ చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులతో కలిసి గురువారం చెన్నై చేరుకున్న బీలే జయ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరోవైపు జయ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందన్న వార్తలతో ‘అమ్మ’ అభిమానులు ఇద్దరు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. అన్నాడీఎంకే కార్యకర్త సర్గుణం(31) బుధవారం రాత్రి నడిరోడ్డుపైనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడగా మధురై జిల్లా ఉత్తపురానికి చెందిన రాజవేల్(21) ఈ నెల 4న ఒంటికి నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన రాజవేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. కాగా, సీఎం జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టించిన మరో ఇద్దరిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 48 మంది కోసం గాలిస్తున్నారు.