: ఏ ఆధారంతో న‌ల్ల‌ధ‌నంపై చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేశారు.. వివరాలు ఎలా తెలిశాయి?.. మోదీకి జ‌గ‌న్ లేఖ‌


ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నల్లధనంపై చేసిన పలు వ్యాఖ్య‌ల ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఐడీఎస్-2016పై జరిగిన పరిణామాలను ప్ర‌ధానికి వివ‌రిస్తున్న‌ట్లు ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై ప‌లువురు నేత‌లు ఒక్కోర‌కంగా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. వ్య‌క్తులు ఆదాయాన్ని వెల్లడిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పేర్కొంద‌ని ఆయ‌న తెలిపారు. మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ వివరాలు ఎలా బ‌య‌ట‌కి చెబుతున్నారని జ‌గ‌న్ అడిగారు. సీబీడీటీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా చంద్ర‌బాబు నాయుడు రెండు సందర్భాల్లో ఇదే అంశంపై ప‌లు వ్యాఖ్యలు చేశారని జ‌గ‌న్ పేర్కొన్నారు. ఓ వ్య‌క్తి 10 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెల్లడించారని చంద్రబాబు వ్యాఖ్య‌లు చేశార‌ని, ఈ సమాచారం ఆయ‌న‌కు ఎలా చేరింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 10 వేల కోట్ల న‌ల్ల‌ధ‌నం క‌లిగి ఉన్న వ్య‌క్తికి చంద్రబాబు బినామీ అయి ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. ఎందుకంటే, అంత కచ్చితంగా 10 వేల కోట్ల రూపాయ‌ల‌ని చంద్ర‌బాబే చెబుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ఎన్‌సీఏఈఆర్ నిర్వ‌హించిన‌ సర్వే ప్ర‌కారం చంద్రబాబు నాయుడి పాలనలో ఏపీ అవినీతిలో మొద‌టి స్థానంలో ఉందని ఆయ‌న పేర్కొన్నారు. చంద్ర‌బాబు నాయుడు ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రూ. లక్షన్నర కోట్ల కుంభకోణానికి ఎలా పాల్పడ్డారో తెలుపుతూ ఓ పుస్తకం ప్రచురించిన‌ట్లు లేఖలో జగన్ పేర్కొన్నారు. ఆ పుస్త‌కాన్ని మోదీకి కూడా అందించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. చంద్ర‌బాబుపై విచారణకు ఆదేశించ‌డానికి తగినంత సమాచారం అందులో ఉందని తెలిపారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి విచారణ జరగలేదని ఆయ‌న అన్నారు. తనపై విచారణ జరిపించే వ్య‌క్తి దేశంలోనే లేర‌ని చంద్రబాబు ఎంతో న‌మ్మ‌కంతో ఉన్నారు. చంద్ర‌బాబు నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనడం, ఓటుకు నోటు కేసులో ప‌లు సాక్ష్యాలు దొరికిపోయినా ఇంకా సీఎం హోదాలోనే ఉన్నార‌ని ఆయ‌న అన్నారు. ఐడీఎస్‌లో ఆదాయాన్ని ప్రకటించిన వారి పేర్లు బ‌హిర్గతం చేయాల‌ని తాను కోరుతున్న‌ట్లు పేర్కొన్నారు. చంద్ర‌బాబు చేసిన అవినీతిపై స్పందించి, ఆయ‌న‌పై విచారణ చేయించాలని జ‌గ‌న్ లేఖ‌లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News