: పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలు జరపాలి: టీపీసీసీ నేత షబ్బీర్ అలీ డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందంటున్న ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు చెల్లించడం లేదని టీపీసీసీ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితి బాగుంటే రైతులకు పూర్తి రుణమాఫీ ఎందుకు చేయలేదని అడిగారు. ప్రజల కష్టాలను పట్టించుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యశ్రీ కోసం డబ్బులు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. అమిత్ షా కేంద్రం నుంచి ఎన్నో కోట్లు ఇచ్చామని ప్రకటించారని, ఆ నిధులన్నీ ఏమయ్యాయని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయించిన నేతల చేత రాజీనామా చేయించి, ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరపాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ముగ్గురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని ఆ స్థానాల్లో మళ్లీ పోటీ చేసి, దమ్ముంటే గెలవాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.