: భారత కుటుంబంపై పాక్ 'హనీ ట్రాప్'... ఇరుక్కుపోయి ఐఎస్ఐ ఏజంట్లుగా మారిన జంట అరెస్ట్
గుజరాత్ లోని కచ్ జిల్లాలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) తరఫున పనిచేస్తున్న ఓ భారతీయ జంటను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దూరదర్శన్ వెల్లడించిన వివరాల ప్రకారం వీరి పేర్లు మొహమ్మద్ అలానా, సాఫూర్ సుమారా. వీరి నుంచి భారత సైన్యం, పారామిలిటరీ దళాలకు చెందిన ఎంతో సమాచారమున్న పత్రాలు లభించాయి. వీరిద్దరినీ వశపరచుకోవడానికి ఓ పాకిస్థాన్ యువతిని 'హనీ ట్రాప్'గా ఎరవేశారని, ఆమె చెప్పిన మాయమాటలు నమ్మి వీరిద్దరూ ఇరుక్కు పోయారని, ఆపై ఐఎస్ఐకి సమాచారం పంపుతున్నారని తెలుస్తోంది. కచ్ రీజయన్ లోని ఖావ్డా గ్రామంలో నివాసం ఉంటున్న వీరిపై అనుమానంతో ఏడాది కాలం పాటు వీరిని గమనిస్తూ వున్నామని, పాక్ ఐఎస్ఐ తరఫున గూఢచర్యం చేస్తున్నారని నిర్ధారించుకున్న తరువాతనే అరెస్ట్ చేశామని ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు. వీరి నుంచి ఓ పాకిస్థాన్ సిమ్ కార్డు, మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు.