: నేను అధ్యక్షుడినైతే చారిత్రాత్మక 'ప్యారిస్' ఒప్పందాన్ని రద్దు చేస్తా: ట్రంప్
పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాలు మద్దతు తెలిపిన చారిత్రాత్మక పారిస్ ఒప్పందంపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. ఫ్లోరిడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, ప్యారిస్ ఒప్పందం గురించి ఆయన మాట్లాడారు. ప్యారిస్ ఒప్పందం వల్ల అమెరికాకు 5.3 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ఒప్పందం కారణంగా దేశంలో విద్యుత్ ధరలు ఆకాశాన్నంటుతాయని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే... విద్యుత్ రంగం కింద ఉన్న 50 ట్రిలియన్ డాలర్లను బయటకు తీసుకొచ్చి... దేశ వ్యాప్తంగా ఊహించని విధంగా ఉద్యోగాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్యారిస్ ఒప్పందం ఇతర దేశాలకు గొప్పగా ఉండొచ్చు కానీ, అమెరికాకు, అమెరికా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరం కాదని వ్యాఖ్యానించారు.