: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీ పరం?... తాజా సర్వే వెల్లడి
రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రస్తుతం దేశంలోని ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సీట్లు ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రచార బరిలోకి దిగి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మరోవైపు ఆ రాష్ట్ర అధికార పార్టీ సమాజ్ వాదీ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి పావులు కదుపుతోంది. బీఎస్పీ కూడా అధికార పక్షాన్ని అనేక విషయాలపై నిలదీస్తూ అధిక మొత్తంలో సీట్లు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే, యూపీ ఎన్నికల నేపథ్యంలో చేసిన తాజా సర్వేలో మాత్రం భారతీయ జనతా పార్టే ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తేలింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ 170-183 స్థానాలను గెలుచుకుని ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే ఫలితాల ద్వారా తెలిసింది. ఇండియా టుడే - యాక్సిస్ నిర్వహించిన ఈ సర్వే ఆధారంగా చూస్తే, ఉత్తరప్రదేశ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తెలుస్తోంది. 115-124 సీట్లతో ప్రతిపక్ష బీఎస్పీ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంటుందని, సమాజ్‌వాదీ పార్టీకి 94-103 స్థానాలు వస్తాయని ఆ సర్వే తెలుపుతోంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 8-12 మధ్య సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఈ సర్వే ప్రకారం మాయావతి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మాయావతి ముఖ్యమంత్రి కావాలని 31 శాతం మంది, అఖిలేష్ యాదవే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని 27 శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారట. ఇక సీఎం అభ్యర్థులుగా సమాజ్‌వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ నుంచి షీలాదీక్షిత్‌లకు కేవలం ఒక్కోశాతమే మద్దతు లభించింది. షీలా దీక్షిత్ ను కాకుండా ప్రియాంకను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రకటిస్తే ఆమెకు 2 శాతం మంది మద్దతు పలుకుతున్నారట. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌కు ఈ అంశంలో 18 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. ఇక యోగి ఆదిత్యనాథ్‌కు 14 శాతం మంది సపోర్ట్ ఇస్తున్నారు. యూపీ రాజకీయాల్లో ప్రధాన అంశాలుగా రామ మందిరం, గో సరంక్షణ వంటి మాటలు మార్మోగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో దళితులపై దాడులు అధికమయ్యాయని 54 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.