: పెదవులపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నారు... తాకరాని చోట తాకారు... ట్రంప్ పై మహిళల ఆరోపణలు


మహిళలను ఉద్దేశించి నీచంగా మాట్లాడారంటూ పలు విమర్శలను ఎదుర్కొంటున్న అమెరికా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్రంప్ తమతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని ముగ్గురు మహిళలు ఆరోపించారు. జెస్సికా లీడ్స్ అనే మహిళా వ్యాపారవేత్త ట్రంప్ నిర్వాకాన్ని తాజాగా బయటపెట్టారు. మూడు దశాబ్దాల క్రితం విమానంలో ట్రంప్, తాను పక్కపక్క సీట్లలో కూర్చొని ప్రయాణించామని... ఆ సందర్భంగా ట్రంప్ తనను అసభ్యంగా తాకారని చెప్పారు. విమానం టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత, తమ మధ్య ఉన్న ఆర్మ్ రెస్ట్ ని తీసేసి, అసభ్యంగా తాకారని తెలిపారు. తన స్కర్ట్ మీద కూడా చేయి వేశారని చెప్పారు. ట్రంప్ ఒక ఆక్టోపస్ లాంటి వాడని... అతనికి అన్ని చోట్లా చేతులు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత ట్రంప్ చేష్టలను తట్టుకోలేక సీటు మారిపోయాయని చెప్పారు. అప్పుడు తన వయసు 38 ఏళ్లని జెస్సికా తెలిపింది. రాషెల్ క్రూక్స్ అనే మహిళ 2005లో ట్రంప్ టవర్ లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేసేవారు. అప్పుడామె వయసు 22. ఒక రోజు లిఫ్టులో ట్రంప్ కలిశారని... ఆయనకు తనను తాను పరిచయం చేసుకుని, షేక్ హ్యాండ్ ఇవ్వగానే... ముందు బుగ్గల మీద, ఆ తర్వాత బలవంతంగా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నారని రాషెల్ తెలిపారు. తనకు చాలా ఇబ్బంది అనిపించిందని... తాను ఏమీ చేయలేననే ధైర్యంతోనే ఆయన అలా చేసి ఉంటారని చెప్పారు. ఆ తర్వాత మరో రోజు తన కార్యాలయానికి వచ్చి తన ఫోన్ నెంబర్ అడిగారని.. ఎందుకు అని తాను అడగ్గా... మోడలింగ్ ఏజన్సీకి పంపుతానని చెప్పారని తెలిపారు. తన పృష్ట భాగంలో ట్రంప్ అసభ్యంగా నొక్కారని 36 ఏళ్ల మిండీ మెకగ్ గిల్లివ్రే అనే మరో మహిళ ఆరోపించారు. ఈ ఘటన 13 ఏళ్ల క్రితం ఓ రిసార్టులో జరిగిందని ఆమె తెలిపారు. వెనుక ఏదో ఇబ్బందిగా అనిపిస్తే, బ్యాగ్ తగిలిందని తొలుత అనుకున్నానని... ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యానని చెప్పారు. అయితే, ఇవన్నీ తప్పుడు ప్రచారాలే అంటూ ట్రంప్ కొట్టి పారేస్తున్నారు. ఇలాంటి వార్తలను ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక మీద పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News