: పొద్దున్నే మార్కెట్ పై టీసీఎస్ దెబ్బ... కీలకమైన 8,650 స్థాయి దిగువకు నిఫ్టీ
ఐటీ దిగ్గజం టీసీఎస్ రెండవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు విడుదల కానున్న వేళ, గణాంకాలు అసంతృప్తిని కలిగించ వచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో స్టాక్ మార్కెట్ సెషన్ ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల దిశగా సాగాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైన 40 నిమిషాలకే సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే, 220 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 27,860 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 సూచిక 64 పాయింట్లు పతనమై 8,644 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. కీలకమైన మద్దతు స్థాయిగా ట్రేడ్ పండితులు పేర్కొనే 8,650 పాయింట్ల స్థాయి నుంచి నిఫ్టీ కిందకు జారడంతో మరింత పతనం తప్పకపోవచ్చని అంచనా. సిప్లా, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఇన్ఫోసిస్ లాభాల్లో సాగుతుండగా, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, రిలయన్స్, టీసీఎస్, టాటా స్టీల్, సన్ ఫార్మా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టాల్లో సాగుతున్నాయి.