: భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అశ్విన్.. నిలకడైన ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్‌గా ఆఫ్ స్పిన్నర్


అశ్విన్.. ఇప్పుడు ఏ క్రికెట్ అభిమాని నోటి వెంట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. నిలకడైన ఆటతీరుతో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ దిగ్గజ బౌలర్లు కుంబ్లే, హర్బజన్ సింగ్ లాంటి వారికి కూడా సాధ్యం కాని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఒకే ఒక్క రికార్డుతో ఇమ్రాన్‌ఖాన్‌ను దాటేసిన అశ్విన్ మరో రికార్డుతో మాల్కం మార్షల్ రికార్డును తిరగరాశాడు. అశ్విన్ మాయాజాలానికి ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఇక వికెట్లను అలవోకగా సాధిస్తున్న అశ్విన్‌పై తాజా, మాజీ క్రికెటర్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో అశ్విన్ ఐదు వికెట్లు సాధిస్తుండడం కూడా అంతే నిజం అని ఒకరంటే చావుపుట్టుకలు ఎంత సహజమో, అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అంతే సహజం అని ఇంకో క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ఐదేళ్ల కెరీర్‌లోనే అద్భుతాలు చేస్తున్న అశ్విన్‌ను ఇక అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని చెబుతున్నారు. తాజాగా కివీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రెండు సార్లు పది వికెట్లు, మూడు సార్లు ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మూడు టెస్టుల్లో 27 వికెట్లు తీసి తానేంటో మరోమారు నిరూపించాడు. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సంగక్కర సొంతగడ్డపై నాలుగుసార్లు అశ్విన్‌కే వికెట్ సమర్పించుకోగా ప్రపంచ టాప్ బ్యాట్స్‌మెన్లలో ఒకడైన విలియమ్సన్ కూడా నాలుగుసార్లు అశ్విన్‌కే అవుటయ్యాడు. అశ్విన్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఏడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌లు అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ఘనత అందుకున్నది పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే. ఇమ్రాన్ 70 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా అశ్విన్ కేవలం 39 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో ఇమ్రాన్ ఖాన్, మాల్కం మార్షల్ మాత్రమే అందుకున్న వరుసగా నాలుగు మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ల రికార్డును అశ్విన్ సరిచేశాడు. కుంబ్లే 8 సార్లు పదివికెట్లు తీయగా అశ్విన్ ఆరు సార్లు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కేవలం 39 టెస్టుల్లోనే 220 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఇన్ని తక్కువ టెస్టుల్లో ఈ రికార్డు అందుకున్న తొలి వ్యక్తి అశ్వినే కావడం గమనార్హం. అన్ని ఫార్మాట్లలో కలిపి అశ్విన్ మొత్తం 413 వికెట్లు తీశాడు. మరే ఇతర బౌలర్‌కు ఇది సాధ్యం కాలేదు.

  • Loading...

More Telugu News