: తెలంగాణలో దయనీయంగా మారిన నేతల పరిస్థితి.. కొత్త జిల్లాలతో తలో దిక్కు!


తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావంతో నేతల పరిస్థితి దయనీయంగా మారింది. ఇన్నాళ్లు జిల్లా పేరుతో ఫేమస్ అయిన నేతలు ఇప్పుడు తలో దిక్కు అయిపోవడంతో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏ ఊరు ఏ జిల్లాలో ఉందో, తాము ఏ జిల్లా నేతలమో అర్థం కాని అయోమయంలో పడిపోయారు. కొత్త జిల్లాల ఆవిర్భావంతో చాలామంది నేతల చిరునామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకే జిల్లాలకు చెందిన నేతలు తలో దిక్కు అయిపోగా కొందరు రెండు మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో వారు తాము ఫలానా జిల్లా ఎమ్మెల్యే అని కచ్చితంగా చెప్పలేని వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కేసీఆర్ సిద్ధిపేట జిల్లావాసయ్యారు. చాలామంది నేతలు జిల్లా పేరుతోనే ఫేమస్ అయ్యారు. డీకే అరుణ అనగానే వెంటనే మహబూబ్‌నగర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అంటే ఆదిలాబాద్ జిల్లాలు గుర్తొస్తాయి. కానీ జిల్లాల పునర్వ్యస్థీకరణతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి వరకు ఆయన నియోజకవర్గం మెదక్ జిల్లాలో ఉండేది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సిద్ధిపేటలోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలో గజ్వేల్, తూఫ్రాన్, కొండపాక, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్ మండలాలు ఉన్నాయి. ఇందులో తూఫ్రాన్ మినహా మిగతా ఐదు మండలాలు సిద్ధిపేటలో ఉన్నాయి. తూఫ్రాన్ మాత్రం మెదక్‌లోకి వెళ్లిపోయింది. దీనిని బట్టి చూస్తే కేసీఆర్ కూడా రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టే. ఇలా చెప్పుకుంటే పలువురు మంత్రులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నిన్నమొన్నటి వరకు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి నిజామాబాద్‌కు చెందినవారు. కానీ నేడు ఆయన పూర్తిగా కామారెడ్డి జిల్లాలోకి చేరిపోయారు. ఆయన నియోజకవర్గాల్లో కొన్ని నిజామాబాద్, మరికొన్ని కామారెడ్డిలో ఉండడంతో ఆయన కూడా రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, టీడీఎల్పీ నేత రేవంత్‌ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, పీసీసీ అధ్యక్షుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే విధమైన అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ఏకంగా మూడు జిల్లాలు జనగామ, వరంగల్ రూరల్, మహబూబాబాద్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం.

  • Loading...

More Telugu News