: విధుల్లో నిబద్ధతతో మరోసారి గొప్ప మనసు చూపిన సుష్మా స్వరాజ్!
విదేశాంగ శాఖా మంత్రిగా సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతాతో భారతీయులందర్నీ కట్టపడేస్తున్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో ఆమె అందర్నీ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె మానవత్వానికి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం సరితా ఠాక్రూ అనే భారతీయ మహిళ భర్త మరణించారు. ఆయన అంత్యక్రియలు పూర్తిచేయాల్సిన కుమారుడు అభయ్ కౌల్ అమెరికాలో ఉండిపోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేశారు. 'మానవతా కోణంలో మా అబ్బాయికి వీసా ఇప్పించండి, ఈ ఒక్క సాయం చేయండి, ఇలాంటప్పుడు కూడా సాయం చేయకపోతే ఎలా?' అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని చూసిన సుష్మ స్వరాజ్ 'ఒక్క నిమిషం.. కనుక్కుంటానని' పోస్ట్ పెట్టి, ఆ వెంటనే సమాధానం ఇచ్చారు. ఈ రోజు దసరా, రేపు మొహర్రం కావడంతో ఎంబసీకి సెలవులని, సిబ్బంది విధులకు దూరంగా ఉన్నారని ఆమె మళ్లీ సమాధానమిచ్చారు. తర్వాత మూడో సారి ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి...'మీ కోసం ఎంబసీని తెరిచాము. అభయ్ కౌల్ కు వీసా మంజూరు చేశామని, ఇప్పుడతను భారత్ వచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేద'ని తెలిపారు. దీంతో నెటిజన్లు సుష్మా స్వరాజ్ ను వేనోళ్ల పొగుడుతున్నారు.