: అలా చేయమని నిజంగా జయలలితే చెప్పారా?: కరుణానిధి అనుమానం
తమిళనాడు ఇన్ ఛార్జీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ప్రకటనపై డీఎంకే అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సిఎం జయలలిత ఆదేశాల మేరకు ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వమ్ కు శాఖల బదలాయింపు జరిగిందన్న గవర్నర్ ప్రకటనపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శాఖల బదలాయింపు జరగాలంటూ ఫైల్ పై జయలలితే సంతకం చేశారా? అని ఆయన ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ, స్టాలిన్ తదితరులు ఆసుపత్రికి వెళ్లినప్పుడు జయతో నేరుగా కలిసి మాట్లాడేందుకు ఎందుకు అనుమతించ లేదని కరుణానిధి అధికారులను ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఆమె ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నా ఇంకెంతకాలం ఆమె చికిత్స పొందాలో తెలియడం లేదని ఆయన పేర్కొన్నారని సమాచారం. గవర్నర్ రాజ్యాంగంలోని అన్ని కోణాలను పరిశీలించాకే శాఖల బదలాయింపు నిర్ణయం తీసుకున్నారా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంచితే, ఇదే సమయంలో శాఖల బదలాయింపును ఆయన కుమారుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ స్వాగతించడం విశేషం.