: పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వం మధ్య విభేదాలు నిజమే!: డాన్ ఎడిటోరియల్
భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన అనంతరం ఈ నెల 6న డాన్ పత్రిక ప్రచురించిన కథనంలోని విషయాలు వాస్తవమేనని డాన్ ఎడిటోరియల్ పేర్కొంది. కాగా, కథనం రాసిన జర్నలిస్టు సిరిల్ అల్మీదాను దేశం విడిచి వెళ్లవద్దంటూ పాక్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన డాన్ పత్రిక ఎడిటర్ ‘రియాక్షన్ టు డాన్ స్టోరీ’ పేరుతో ఎడిటోరియల్ రాశారు. ‘‘వార్తను పూర్తిగా పరిశీలించామని, ఒకటికి పదిసార్లు వాస్తవాలను పూర్తిగా నిర్ధారించుకున్నాకే ప్రచురించామని ఈ ఎడిటోరియల్ లో ఎడిటర్ పేర్కొన్నారు. ఈ వార్తకు పూర్తి బాధ్యత తనదేనంటూ ఆయన స్పష్టం చేశారు. జర్నలిజం నియమనిబంధనలకు అనుగుణంగానే తమ వార్త ఉందని తెలిపారు. పత్రిక విలువలను తుంగలోకి తొక్కినప్పుడు ఏ పత్రికపై అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని, ఇందుకు డాన్ అతీతం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే తాము ప్రచురించిన వార్తలో అవాస్తవాలు లేవని, పూర్తి ఆధారాలతోనే దానిని ప్రచురించామని ఆయన తెలిపారు. దీంతో జర్నలిస్టుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.