: 'చైనా ఉత్పత్తుల బాయ్ కాట్' పిలుపు విఫలం... ఎందుకంటే!
ఇండియాలో ఉగ్రదాడులను ప్రేరేపిస్తున్న పాకిస్థాన్ తో స్నేహంగా ఉన్న చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలన్న ప్రచారం ఇండియాలో విఫలమైందని 'ఇండియా స్పెండ్' విశ్లేషణలో తేలింది. ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇండియాకు దిగుమతి అయ్యే ఉత్పత్తుల్లో ఆరోవంతు వరకూ అందిస్తున్న చైనాను అంత తేలికగా వదులుకునే పరిస్థితి లేదన్నది నిపుణుల అంచనా. 2011-12లో ఇండియాకు దిగుమతి అయ్యే వస్తువుల్లో పదోవంతు వస్తువులు చైనా నుంచి వస్తుండేవి. ఆ తరువాత వచ్చిన సాంకేతిక మార్పులతో చైనా స్థానం నానాటికీ పెరిగింది. గడచిన ఐదేళ్లలో 5 శాతం మేరకు, గడచిన రెండేళ్లలో 20 శాతం మేరకు చైనా ఉత్పత్తుల దిగుమతి పెరిగింది. ప్రస్తుతం చైనాతో భారత వాణిజ్యం 61 బిలియన్ డాలర్లకు పెరిగింది. గణేశుడి విగ్రహాల నుంచి సెట్ టాప్ బాక్సులు, విద్యుత్ తయారీ ఉపకరణాల వరకూ చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. గడచిన ఐదేళ్లలో అంటే, 2011 నుంచి 2016 మధ్య భారత విదేశీ వాణిజ్యం 490 బిలియన్ డాలర్ల నుంచి 380 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీనికి ప్రధాన కారణం చమురు ధరల పతనం కాగా, ఇదే సమయంలో చైనా వాణిజ్యం పెరిగింది. ప్రస్తుతం చైనా నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, సోలార్ సెల్స్, ఫర్టిలైజర్ ఉత్పత్తులు, కీబోర్డులు, డిస్ ప్లే, కమ్యూనికేషన్ పరికరాలు... ఇలా వేల కోట్ల రూపాయల విలువైన ప్రొడక్టులు దిగుమతి అవుతున్నాయి. వీటి విక్రయాలను ఒక్కసారిగా నిలిపివేసే పరిస్థితి లేదన్నది నిపుణుల అభిప్రాయం. ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశమేమంటే, ఇండియా నుంచి చైనాకు జరిగే ఎగుమతుల విలువ గణనీయంగా తగ్గుతోంది. 2011-12లో 18 బిలియన్ డార్లుగా ఉన్న చైనాకు ఎగుమతులు 2015-16లో 9 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక్కడి నుంచి పత్తి, కాపర్, పెట్రోలియం, పారిశ్రామిక యంత్రాలు తదితర కొన్ని ప్రొడక్టులే చైనాకు ఎగుమతి అవుతున్న పరిస్థితి. చైనాతో ఎగుమతి, దిగుమతుల్లో సమతుల్యత లోపించడం కూడా చైనాను అడ్డుకోలేకపోవడానికి మరో కారణం. ఇక 2015-16లో చైనా నుంచి 5.3 బి. డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లు దిగుమతి కాగా, ఆ తరువాతి స్థానం ఫర్టిలైజర్స్ రంగం ఆక్రమించింది. ఈ విభాగంలో 3 బి. డాలర్ల విలువైన ఉత్పత్తుల దిగుమతి నమోదైంది. లాన్ కార్డులు, పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు), నెట్ వర్క్ కార్డులు తదితరాలు 2.5 బి. డాలర్ల విలువైనవి దిగుమతి కాగా, 2.1 బి. డాలర్ల విలువైన ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు భారత్ కు వచ్చాయి. సోలార్ సెల్స్, ఎల్ఈడీల విభాగంలో 2 బి. డాలర్ల వాణిజ్యం జరిగింది. నెట్ వర్క్ స్విచ్ లు, డాంగిల్స్, మోడెమ్ లు, ఇయర్ ఫోన్లు, సెల్ ఫోన్లలో వాడే వైబ్రేటర్ మోటార్లు, నదులు, సరస్సులపై తేలియాడే బోట్లు, నౌకల నిర్మాణానికి అవసరమయ్యే పరికరాలు, భారీ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ఉపకరణాలు వంటివెన్నో చైనా నుంచి వస్తున్నాయి. పిల్లల బొమ్మలు, కుష్టు వ్యాధి ఔషధాలు, యాంటీ బయాటిక్స్ కూడా వస్తున్నాయి. ఇక చైనాను అడ్డుకునేందుకు జనతాదళ్ నేత శరద్ యాదవ్, అసోం కొత్త ఆర్థిక మంత్రి హిమాంత బిశ్వా శర్మ, హర్యానా మంత్రి అనిల్ విజ్ తదితరులు 'మేడిన్ చైనా' గూడ్స్ వాడవద్దని పెద్ద ప్రచారాన్నే ప్రారంభించారు. వీటి స్థానంలో భారత కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులు వాడితే, చైనాపై ఒత్తిడి పెంచవచ్చని వారితో పాటు ఎంతో మంది వాదించినప్పటికీ, చైనా స్థాయి సాంకేతికత, క్వాలిటీని సాధించడానికి భారత్ లో ఇంకా మౌలిక వసతుల అభివృద్ధి జరగనందున ఈ ప్రచారం విఫలమైంది. చైనా ఉత్పత్తులు లభించే దరలకు అదే తరహా భారత ఉత్పత్తులు అందక పోవడం కూడా ఇందుకో కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు.