: దేశంలోని ఒకే ఒక్క మరకత శివలింగం చోరీ
తమిళనాడులోని నాగపట్టణానికి సమీపంలోని తిరుక్కవలై త్యాగరాజస్వామి ఆలయం... ఓ కుగ్రామంలోని ఈ దేవాలయంలో మరకత శివలింగం ఉంది. మరకత లింగం కారణంగా ఈ దేవాలయం దేశ ప్రసిద్ధి చెందింది. శతాబ్దాల నాడు రాజేంద్ర చోళరాజు తూర్పు దేశాల నుంచి ఈ లింగాన్ని తెప్పించి ప్రతిష్టించగా, ఇది చోరీకి గురైంది. ఆలయ అధికారుల కథనం ప్రకారం, ఉదయం పూజారి పూజలు చేసి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చే సరికి శివలింగం మాయమైంది. ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టాలని భావిస్తున్న సమయంలోనే ఈ దొంగతనం జరిగిందని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గర్భగుడి తలుపులు తీసిన వేళ, సేఫ్టీ అలారం పనిచేయలేదని గుర్తించారు. గుడి గురించి తెలిసిన వాళ్లే ఈ పని చేసుంటారని నమ్ముతూ విచారణ ప్రారంభించారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి చోరుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. మరకత లింగం చోరీ కావడం పట్ల ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.