: పాక్ కోసం ఇండియాను వదులుకునేందుకు సిద్ధంగా లేని చైనా!

ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్థాన్ తో గట్టి స్నేహబంధాన్ని నడుపుతున్న చైనా నెమ్మదిగా మారుతోంది. పాకిస్థాన్ తో వేల కోట్ల రూపాయల విలువైన ఎకనామిక్ కారిడార్ ను ఏర్పాటు చేసి, ఆ దేశానికి వందల కోట్ల విలువైన ఆధునిక ఆయుధాలను ఇస్తున్నప్పటికీ, ఇండియాతో ఉన్న వ్యాపార, వాణిజ్య బంధానికి దూరం కావాలని మాత్రం చైనా కోరుకోవడం లేదు. ఈ వారాంతంలో గోవాలో జరిగే బ్రిక్స్ సమావేశాలకు చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్ఎస్జీ (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్)లో ఇండియా చేరే అంశంపై తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కోసం భారత స్నేహబంధాన్ని వదులుకోవాలని తాము భావించడం లేదన్న సంకేతాలను చైనా చూపుతోందని విదేశాంగ శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్ఎస్జీలో భారత్ చేరిక అంశం ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక అంశం కాదని గుర్తు చేస్తున్నారు. ఇక మనూద్ అజర్ విషయంలో మాత్రం పాక్ తో పాటు ఇండియాపైనా ఒత్తిడి పెంచేందుకే చూస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల జాబితాలో మసూద్ ను చేర్చేందుకు సాంకేతికాంశాలు అడ్డు నిలుస్తున్నాయని, రాజకీయ ప్రమోజనాలు దాగున్నాయని ఓ వైపు నుంచి భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ, మరోవైపు తప్పనిసరిగా కఠిన చర్యలను ఉగ్రవాదులపై తీసుకోవాల్సిందేనని పాక్ దేశానికి స్పష్టం చేస్తోంది. చైనా వైఖరిని నిశితంగా పరిశీలిస్తుంటే, ఇండియా నుంచి తమ దేశానికి లభించే ఆదాయాన్ని వదులుకునే దిశగా ఎలాంటి నిర్ణయాలనూ తీసుకునే ఆలోచనలో లేదని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి భూపత్ శశాంక్ అంచనా వేశారు.

More Telugu News