: రక్తమోడిన కాబూల్.. దుండగుడి కాల్పుల్లో 14 మంది షియాలు మృతి
కాబూల్ మరోమారు రక్తమోడింది. షియా ముస్లింలపై ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందగా 36 మంది గాయపడ్డారు. షియా కేలండర్‌లోని ప్రముఖ పండుగైన ఆసురాను జరుపుకునేందుకు మంగళవారం పెద్ద ఎత్తున గుమిగూడిన షియాలపై సాయుధ దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని హతమార్చినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సిదిఖ్ సిద్ధిఖి తెలిపారు. కాల్పులు జరిగిన కర్టే సఖి మందిరం కాబూల్ యూనివర్సిటీకి అత్యంత సమీపంలో ఉంది. కాల్పుల సమాచారం అందుకున్న ప్రత్యేక దళాలు వెంటనే అక్కడికి చేరుకుని దుండగుల కోసం గాలించాయి. అక్కడి నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు తరలించాయి. కాల్పుల్లో మృతి చెందిన 14 మందిలో 13 మంది పౌరులు కాగా ఒకరు పోలీసు అధికారి. కాల్పుల సమయంలో రెండు గ్రనేడ్లు కూడా పేలినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు ఇంత వరకు ఏ సంస్థా బాధ్యత వహించలేదు. ఈ ఘటనను మానవత్వంపై జరిగిన దాడిగా అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పేర్కొన్నారు.