: పాంపోర్‌లో ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఆపరేషన్
పాంపోర్‌లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(ఈడీఐ) హాస్టల్ బిల్డింగ్‌లోకి చొరబడి మూడు రోజులుగా కాల్పులు జరుపుతున్న లష్కరే తాయిబా ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోమవారం రాత్రి ప్రారంభమైన కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా మంగళవారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ బిల్డింగ్‌లోకి కొన్ని రోజుల క్రితం ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు చొరబడ్డారు. జీలం నది ద్వారా బోట్లలో వచ్చి ఈ బిల్డింగ్‌లో చొరబడినట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు తొలుత సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభించారు. మంగళవారం ఉగ్రవాదుల వైపు నుంచి ఎటువంటి కాల్పులు లేకపోయినా ఆపరేషన్ కొనసాగుతున్నట్టు ఆర్మీ పేర్కొంది. భవనంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ పెద్ద ఎత్తున మందుగుండును ఉపయోగిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆర్మీ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఉగ్రవాదులు ఇదే భవనంలోకి చొరబడి కాల్పులు ప్రారంభించిన విషయం తెలిసిందే.