: భారత్ సరిహద్దు మూసేస్తే ప్రజల్లో విద్వేషం పెచ్చరిల్లుతుంది: హెచ్చరిస్తున్న చైనా నిపుణులు


పాకిస్థాన్‌తో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయాలన్న భారత్ నిర్ణయంపై చైనా విస్మయం వ్యక్తం చేసింది. అలా చేస్తే రెండు దేశాల మధ్య ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించింది. ఆ ఆలోచన సరికాదని, సరిహద్దు వాణిజ్యంపై ఆ ప్రభావం ఎంతగానో పడుతుందని చైనా నిపుణులు పేర్కొంటున్నారు. ఉరీ ఘటన తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకుండానే పాక్‌ను దోషిగా తేల్చి సరిహద్దును మూసివేయాలనుకోవడం పొరపాటే అవుతుందని ఓ మేధో సంస్థ రీసెర్చ్ స్కాలర్ హు ఝియాంగ్ అన్నారు. ఉరీ ఉగ్రఘటన తర్వాత దేశంలోని ఉగ్రవాదుల చొరబాట్లను నివారించేందుకు 2018 నాటికి సరిహద్దులను పూర్తిగా మూసివేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ అనుకున్నట్టుగా సరిహద్దులను మూసేస్తే రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముందని చైనాలోని సదరన్ అండ్ సెంట్రల్ ఆసియన్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వాంగ్ డెహువా పేర్కొన్నారు. ఆ ప్రభావం భారత్-పాకిస్థాన్-చైనా పైనా పడుతుందన్నారు. భారత్ తీసుకున్న నిర్ణయం కోల్డ్‌వార్‌ మనస్తత్వాన్ని తలపిస్తోందని విమర్శించారు. అంతేకాదు.. సరిహద్దు మూసేస్తే ఇటు భారత్‌, అటు పాకిస్థాన్‌లోని ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News