: సౌకర్యాలు సరెండర్ చేయాలంటూ మాజీ పోలీసులకు కేంద్రం ఆదేశం.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిక
మాజీ పోలీసు అధికారులు ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలను వెంటనే సరెండర్ చేయాలని, లేదంటే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాసింది. పోలీస్ శాఖలో పనిచేసి రిటైరైన ఉద్యోగుల్లో చాలామంది అధికారులు ప్రభుత్వ వాహనాలతోపాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇంకా తమతో పాటే ఉంచుకుంటున్నారు. అంతేకాక పెట్రోలు ఓచర్లు కూడా వినియోగించుకుంటున్నారు. దీంతో కళ్లు తెరిచిన కేంద్రం తక్షణం వారు తమ సౌకర్యాలను వదులుకోవాలని ఆదేశించింది. లేదంటే జరిమానా, చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. వారు పొందుతున్న సౌకర్యాలను నిలిపివేయాలని, ఆ వివరాలను వెంటనే కేంద్రానికి పంపాలని ముఖ్యకార్యదర్శులను ఆదేశించింది.