: అప్పుడు సర్జికల్ దాడులు చేయాలనుకున్నాం... కానీ వాజ్ పేయి వద్దన్నారు: మాజీ ఆర్మీ చీఫ్
మాజీ ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ ఓ ఆసక్తికర వాస్తవాన్ని బయటపెట్టారు. 1999లో పీఓకేలోకి ప్రవేశించి సర్జికల్ దాడులు జరపడానికి తాము సిద్ధమయ్యామని... కానీ నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి తమను అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయంగా ఒత్తిడులు రావడం, అదే సమయంలో దేశంలో ఎన్నికలు కూడా జరగనుండటంతో సర్జికల్ దాడులకు వాజ్ పేయి ఒప్పుకోలేదని చెప్పారు. కార్గిల్ యుద్ధ సమయంలో వీపీ మాలిక్ ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. అహ్మదాబాద్ లో ఈ రోజు జరిగిన 'లీడర్ షిప్-మోటివేషన్ ఎక్స్ పో'లో ఆయన మాట్లాడుతూ, సర్జికల్ దాడులు చేసిన తర్వాత పాక్ పై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావడానికి ఎవరినీ అడగాల్సిన అవసరం లేదని... పాక్ తన బుద్ధిని మార్చుకోకపోతే యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని పాక్ కు తెలియజేస్తే సరిపోతుందని మాలిక్ తెలిపారు. ఓ ప్రశ్నకు సమాధానంగా... ఒక్క సర్జికల్ స్ట్రైక్ తో పాక్ మారుతుందని తాను భావించడం లేదని చెప్పారు.