: ఈ ఏడుగురి వల్ల సమాజానికి ఎలాంటి మేలు ఉండదు: వెంకయ్యనాయుడు
సమాజానికి ఓ ఏడుగురు వ్యక్తుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఏడు రకాల స్వభావాలు కలిగిన వ్యక్తులతో ఉపయోగం ఉండదని పెద్దలు చెప్పేవారని అన్నారు. ఆ ఆరు స్వభావాలు ఏవంటే... 1) క్రోధనులు 2) పరభాగ్యోపజీవి 3) ఈర్ష్యాలుడు 4) జుగుప్సావంతుడు 5) నిస్సంతోషి 6) నిత్యశంకితుడు 7) దుఃఖబాగులు వీరికి ప్యాకేజీ ఇచ్చినా సంతోషం ఉండదని, ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారని, ఇలాంటి వారివల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. గతంలో తాను కూడా ఆవేశంగా ఉండేవాడినని, ఓసారి హిందీ భాషపై నిరసన వ్యక్తం చేయడానికి ఆందోళన చేశామని, అప్పుడు తాము హిందీ డౌన్ డౌన్ అని అరచామని, ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన విజయవంతం చేయడం ఎలా? అని ఆలోచిస్తుండగా, ఓ వ్యక్తి వచ్చి పోస్టాఫీసులు, రైల్వేస్టేషన్లలో పేర్లను హిందీలో రాస్తారని చెప్పడంతో అక్కడికెళ్లి బోర్డులపై తారు రాశామని గుర్తుచేసుకున్నారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లిన సందర్భంగా ఎల్.కే. అద్వానీ తనను రాష్ట్రీయ నేతను చేసినప్పుడు ఆ తారు హిందీ బోర్డులపై రాసుకోలేదని, తమ ముఖాలపైనే రాసుకున్నామని అర్థమైందని ఆయన అన్నారు.