: కంటతడి పెట్టిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే
బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకునే కంటతడి పెట్టింది. మాట్లాడుతూనే ఏడ్చేసింది. గతంలో తాను తీవ్ర ఒత్తిడికి గురైన సందర్భాలను గుర్తు చేసుకుని... ఆ సమయంలో తనతో పాటు తన తల్లి, తండ్రి, సోదరి లేకపోతే తాను ఏమై పోయేదాన్నో అంటూ కన్నీరు కార్చింది. తన స్వచ్ఛంద సంస్థ 'లివ్ లవ్ లాఫ్' ద్వారా మానసిక ఒత్తిడిపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, తీవ్ర ఉద్విగ్నతకు లోనయింది దీపిక. ప్రస్తుతం మనం ఎలాంటి సమాజంలో ఉన్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని... ఈ సమాజానికి చెందిన వాళ్లం కాదనే ఆలోచనను మనసులో నుంచి తీసివేయాలని తెలిపింది. మన ముందు ఉన్న పెద్ద పోటీ ప్రపంచంలోకి చొచ్చుకుని వెళ్లాలని దీపిక సూచించింది. ఈ రోజుల్లో చాలా మంది చాలా సున్నితంగా తయారవుతున్నారని... అలా మారకూడదని, అది మంచిది కాదని చెప్పింది. ఈ సందర్భంగా అన్ని వేళలా తనతో పాటు ఉన్న తల్లి, తండ్రి, సోదరికి థ్యాంక్స్ చెప్పింది దీపిక. అయితే, ఏ విషయంతో డిప్రెషన్ లోకి వెళ్లిందో మాత్రం ఈ అందాల భామ చెప్పలేదు.