: సిద్ధిపేటకు మెడికల్ కాలేజ్... హరీష్ కు నా ఆశీస్సులు: కేసీఆర్


సిద్ధిపేట జిల్లాను తన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్ధిపేట జిల్లాను ప్రారంభించిన అనంతరం ఓపెన్ టాప్ వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన... సిద్ధిపేటలో తనకు తెలియని వీధి, గడప లేదని అన్నారు. సిద్ధిపేట ఓ అద్భుతమైన ప్రాంతంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సిద్ధిపేటలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని హరీష్ రావు కోరారని... వచ్చే ఏడాది మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్పారు. సిద్ధిపేట అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తానని తెలిపారు. యువకుడైన హరీష్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారని... ఆయన నాయకత్వంలో జిల్లా అభివృద్ధిపథంలో పయనిస్తుందని చెప్పారు. హరీష్ కు నా ఆశీస్సులు అంటూ మేనల్లుడిని దీవించారు. తానెక్కడున్నా తన మనసు సిద్ధిపేట మీదే ఉంటుందని... ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకేనని అన్నారు. 30 ఏళ్ల క్రితమే సిద్ధిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను కోరానని... కానీ, అప్పట్లో అది సాధ్యం కాలేదని కేసీఆర్ చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కొందరు అవాకులు, చెవాకులు మాట్లాడారని... ఈరోజు దసరా కావడంతో, వారి గురించి ఏమీ మాట్లాడనని అన్నారు. 21 కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలోని మొత్తం జిల్లాల సంఖ్య 31కి పెరిగిందని... దీని వల్ల, రాష్ట్రంలో అదనంగా 21 మంది కలెక్టర్లు, 21 మంది ఎస్పీలు వచ్చారని... దీంతో, పరిపాలన మరింత మెరుగవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News