: జయలతితపై దుష్ప్రచారం చేసిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్... అరెస్ట్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున దుష్ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, దీని వెనుక ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూడా ఉన్నాడని, అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జయ ఆరోగ్యం బాగోలేదని అపోలో ఆస్పత్రి ఉద్యోగి చెప్పినట్టు ఈ టెక్కీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాడు. ఎంసీఏ చదివిన సతీష్ కుమార్ (26) సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. మదాసమి (25)అనే మరో యువకుడు ఓ సంస్థలో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. అపోలో ఆసుపత్రి ఉద్యోగి చెప్పినట్టు ఉన్న ఆడియోను మదాసమి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీన్ని సతీష్ కుమార్ ఫేస్ బుక్ లో విపరీతంగా దుష్ప్రచారం చేశాడు. ఇద్దరూ కలసి తోటి ప్రజలు భయపడేంత స్థాయిలో ఆడియో క్లిప్పింగులు, మెసేజ్ లు పెట్టారు. ఈ క్రమంలో, ఏఐఏడీఎంకే ఐటీ సెక్రటరీ కేఆర్ రామచంద్రన్ ఫిర్యాదు చేయడంతో... సెంట్రల్ క్రైం బ్రాంబ్ పోలీసులు దర్యాప్తు చేసి వీరిద్దరినీ అరెస్ట్ చేశారు.