: మోనికా హత్యకేసులో బయటకొస్తున్న సంచలన విషయాలు.. ఆమెను నగ్నంగా షూట్ చేయాలనుకున్నానన్న నిందితుడు
ప్రముఖ పెర్ఫ్యూమ్ పరిశోధకురాలు మోనికా ఘర్డే హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి నోటి నుంచి వస్తున్న వాస్తవాలను వింటున్న పోలీసులు విస్తుబోతున్నారు. మోనికాను హత్య చేసింది తానేనని అంగీకరించిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్ సింగ్(21) పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించాడు. బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఆమెను నగ్నంగా వీడియోలో చిత్రీకరించాలని అనుకున్నట్టు తెలిపాడు. అయితే మోనికాను హత్య చేసేముందు రాజ్‌కుమార్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు అతడిని లోతుగా ప్రశ్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. రాజ్‌కుమార్.. మోనికా ఇంటిలో దోపిడీ చేయాలని ప్లాన్ వేశాడు. ఆమె ఇంటి వెనక వైపున ఉన్న ఫెన్సింగ్ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లి కత్తి చూపించి మోనికాను బెదిరించాడు. మాట్లాడొద్దని హెచ్చరిస్తూ ఆమె చేతులు కట్టేశాడు. ఏటీఎం కార్డు అడిగి పిన్ నంబరు తెలుసుకున్నాడు. తర్వాత ఆమె దుస్తులు విప్పించి సెల్‌ఫోన్‌లో షూట్ చేయాలనుకున్నాడు. తద్వారా భవిష్యత్తులో ఆమెను బెదిరించి డబ్బులు గుంజవచ్చని అనుకున్నాడు. అయితే ఆమెను అలా షూట్ చేసిందీ లేనిదీ మాత్రం తెలియరాలేదు. తర్వాత ఆమె ముక్కు, నోరు గట్టిగా మూసి పట్టుకోవడంతో స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత వంటింట్లోకి వెళ్లిన నిందితుడు తీరిగ్గా కోడిగుడ్లు ఉడకబెట్టుకుని తిన్నాడు. అప్పటికి చాలాసేపైనా ఆమె ఇంకా స్పృహలోకి రాకపోవడంతో అనుమానం వచ్చి తట్టి చూశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె నుంచి దొంగిలించిన ఏటీఎం కార్డుతో సోమవారం బెంగళూరులో డబ్బులు డ్రా చేస్తుండగా పోలీసులకు చిక్కాడు. నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించేందుకు ట్రాన్సిట్ వారంటుపై పోలీసులు గోవా తరలించారు.