: ఆ రోగికి చికిత్స చేయకు... చంపేసేయ్!: ఆగ్రా డాక్టర్ గారి నిర్వాకం!
'వైద్యో నారాయణో హరి:' అంటారు. అంటే వైద్యుడు దేవుడితో సమానం. ఎందుకంటే, దేవుడు ప్రాణం పోస్తే... వైద్యుడు ప్రాణాలను కాపాడతాడు కాబట్టి. కానీ, వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడో డాక్టర్. తమ వద్దకు వచ్చిన రోగికి వైద్యం చేయవద్దని, చంపేయాలంటూ తన జూనియర్ కు ఆదేశాలు జారీ చేశాడు. ఈ దారుణ ఘటన ఆగ్రాలోని ప్రఖ్యాతిగాంచిన ఎస్ఎన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, టీబీతో బాధపడుతున్న ముఖేష్ ప్రజాపతి (18)ని అతని తండ్రి శుక్రవారం రాత్రి 10 గంటలకు హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ప్రజాపతి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అయితే, ప్రజాపతిని అడ్మిట్ చేసుకోవడానికి అక్కడున్న డాక్టర్లు నిరాకరించారు. దీంతో, నోటీస్ బోర్డు మీద ఉన్న సర్జరీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ శ్వేతాంక్ ప్రకాశ్ ఫోన్ నంబరుకు ప్రజాపతి తండ్రి ఫోన్ చేశాడు. శ్వేతాంక్ కు ఫోన్ చేస్తే పని జరుగుతుందన్న భావనతో ఆయన ఫోన్ చేశాడు. ప్రజాపతి మొబైల్ నుంచే కాల్ చేశాడు. దీంతో, అదే ఫోన్ ద్వారా డ్యూటీలోని జూనియర్ డాక్టర్ తో శ్వేతాంక్ మాట్లాడాడు. ఆ తర్వాత ప్రజాపతిని హాస్పిటల్ లో చేర్చుకున్నారు. కానీ, కాసేపటికే అతను చనిపోయాడు. అయితే, ప్రజాపతి ఫోన్ లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఎప్పుడూ ఆన్ లో ఉంటుంది. దీంతో, శ్వేతాంక్ తన జూనియర్ డాక్టర్ తో మాట్లాడినదంతా ఫోన్ లో రికార్డ్ అయింది. ఈ విషయం డాక్టర్లకు తెలియదు. ప్రజాపతి చనిపోయిన తర్వాత... అతని ఫోన్ లో రికార్డ్ అయిన సంభాషణ విని అతని కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. "ఆ రోగిని హాస్పిటల్ లో చేర్చుకో. సర్జరీ వార్డులో లేదా మెడిసిన్ వార్డ్ లో అడ్మిట్ చెయ్. అతన్ని చంపేసేయ్. రక్తం తెమ్మని చెప్పు. వాళ్లే పారిపోతారు"... ఇదీ ఫోన్ రికార్డయిన సంభాషణ. వెంటనే సీనియర్ డాక్టర్ పై ప్రజాపతి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే, తన ఆడియో క్లిప్ ను ఎడిట్ చేసి, తాను అనని మాటలను కూడా చేర్చారని డాక్టర్ శ్వేతాంక్ ఆరోపించాడు. రోగికి మెరుగైన వైద్యం చేయాలని తాను తన జూనియర్ కు సూచించానని చెప్పాడు. తన పేరును చెడగొట్టడానికే ఇదంతా చేస్తున్నారని తెలిపాడు.