: కళ్లు తెరిచిన సంజన.. వారం రోజులుగా కోమాలో ఉన్న చిన్నారి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వారం రోజులుగా కోమాలో ఉన్న చిన్నారి సంజన సోమవారం కళ్లు తెరిచింది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. ఈ నెల 2వ తేదీన పెద్ద అంబర్‌పేట వద్ద రోడ్డు దాటుతున్న సంజన, ఆమె తల్లి శ్రీదేవిలను కారు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. కాగా అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న సంజన సోమవారం ఉదయం కళ్లు తెరిచి చూసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సంజన కళ్లు తెరిచినప్పటికీ ఇంకా కోమాలోనే ఉన్నట్టు భావించాల్సి ఉంటుందని ఆమె చికిత్స పొందుతున్న కామినేని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. వెంటిలేటర్ తొలగించి 24 గంటలు పర్యవేక్షించిన తర్వాత సంజన ఆరోగ్య పరిస్థితిపై భరోసా ఇవ్వగలమని ఆమె తండ్రి శివానంద్‌కు తెలిపారు.