: టెక్నాలజీ వైపు గ్రేటర్ ఆర్టీసీ అడుగులు.. హైదరాబాద్‌లో 115 ఏసీ బస్సుల్లో వైఫై సేవలు
గ్రేటర్ ఆర్టీసీ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు బస్సుల్లో వైఫై సేవలు అందించాలని నిర్ణయించింది. అంతేకాకుండా బస్టాపుల్లో బస్సుల రాకపోకల వివరాలు తెలిపేలా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత ఉప్పల్-గచ్చిబౌలి రూట్‌లో తిరిగే ఏసీ బస్సుల్లో ఏర్పాటు చేసిన వైఫై సేవలు సత్ఫలితాన్నివ్వడంతో మరో 115 బస్సుల్లో వైఫై ఏర్పాటుకు సన్నద్ధమైంది. ఈ ఏర్పాటుతో ఏసీ బస్సుల్లో ప్రయాణించే తొలి 20 నిమిషాలు ప్రయాణికులకు వైఫై సేవలు అందనున్నాయి. అలాగే సోమవారం నుంచి మరో 75 కొత్త రూట్లలో బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లతోపాటు కూకట్‌పల్లి, సికింద్రాబాద్, కోఠి, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లోని ప్రయాణ ప్రాంగణాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు తిరిగే 3800 బస్సుల్లో జీపీఎస్ విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నించినా నిధుల కొరతతో దానిని మధ్యలోనే ఆపేశారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందడంతో తిరిగి జీపీఎస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.