: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దసరా ఉత్సవాలు.. ఆనందంగా జరుపుకుంటున్న ప్రజలు
తెలుగు రాష్ట్రాల్లో దసర సంబురాలు మొదలయ్యాయి. ఈ ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రాకతో ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిజరూప అలంకారంలో లక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వరీ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. శ్రీరాజరాజేశ్వరీదేవిగా కనకదుర్గ అమ్మవారు దర్శనమిస్తున్నారు. సాయంత్రం అమ్మవారు కృష్ణా నదీ విహారం చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నేటి నుంచి తిరు కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీభూసమేత శ్రీమహావిష్ణు అలంకారంలో స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు.