: ఇండోర్ టెస్టు: మూడోరోజు ముగిసిన ఆట.. న్యూజిలాండ్‌కు ఫాలో ఆన్ ఇవ్వని టీమిండియా
న్యూజిలాండ్, భారత్ క్రికెట్ టీమ్‌ల మధ్య మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో మూడోరోజు ఆటముగిసింది. రెండో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఈరోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. భారత్ ఇచ్చిన 557 పరుగుల లక్ష్యసాధనలో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 299 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా 258 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, న్యూజిలాండ్‌కు టీమిండియా ఫాలో ఆన్ ఇవ్వలేదు. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ 11 పరుగులు చేయగా, గౌతమ్ గంభీర్ 6 పరుగులు చేసి గాయంతో తప్పుకున్నాడు (రిటైర్డ్ హర్ట్). ఆ తరువాత బరిలోకి వచ్చిన ఛటేశ్వర పుజారా ఒక్కపరుగు చేశాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లను ఈరోజు అశ్విన్ మట్టికరిపించాడు. మొదటి ఇన్సింగ్స్‌లో 6 వికెట్లు తీశాడు. జడేడా ఖాతాలో 2 వికెట్లే పడ్డాయి. ప్రస్తుతం 276 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది.