: భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతులు కట్టేసి వున్నాయి: ఫారిన్ మీడియా
భారత్ ను అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లగలిగే పలు ప్రాజెక్టుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతులు కట్టేసి ఉన్నాయని విదేశీ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని అమలు చేయాలని ఆయనకు ఉన్నప్పటికీ, కొన్ని చట్టాలు, ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయని 'బ్లూమ్ బర్గ్' వార్తా సంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తూర్పున హిమాలయాల పర్వతాల్లో ఉన్న ఓ గ్రామానికి చెందిన 200 కుటుంబాలు ఓ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును అడ్డుకున్నాయని, హిమాచల్ ప్రదేశ్ లో ఓ వర్గం కమర్షియల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిలిచిందని, వీరికి 2006 నాటి అటవీ హక్కుల చట్టం అండగా ఉందని తెలిపింది. ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టుకు అటవీ భూమిని సేకరించాలంటే, ఆ ప్రభావం పడే ప్రజల అనుమతి తప్పనిసరన్న నిబంధన మోదీ కాళ్లకు అడ్డంకిగా మారిందని పేర్కొంది. పలు గ్రామాల ప్రజలకు జాతీయ హరిత ట్రైబ్యునల్ కల్పించిన సాధికారత ప్రధానికి సవాళ్లు ఎదురయ్యేలా చేస్తోందని, రైతుల నిరసనల కారణంగా ఇండియాలో ఎన్నో ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయని వెల్లడించింది. ఓ వైపున భారత్ లో వ్యాపారం చేయడానికి అవకాశాలను సరళీకరించాలని మోదీ భావిస్తుండగా, అటవీ చట్టాలు ప్రధాన అడ్డంకులైనాయని పర్యావరణ శాస్త్రవేత్త, న్యాయవాది రిత్విక్ దత్తా అభిప్రాయపడ్డారు. సమస్యలను పరిష్కరించే దిశగా భారత సర్కారు కదలడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాలో ఎన్ని పరిశ్రమలు ఈ కారణాలతో ఆగిపోయాయో లెక్క లేదని, బొగ్గు గనులు, వివిధ ఖనిజాల గనులు, పైప్ లైన్ ప్రాజెక్టులు నిలిచాయని, కొన్ని రాష్ట్రాల్లోని స్థానిక ప్రభుత్వాలు సైతం ప్రాజెక్టులు ఆగిపోయేందుకు కారణమైనాయని బ్లూమ్ బర్గ్ తెలిపింది. గడచిన మూడేళ్లలో 2,306 ప్రాజెక్టులు ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు అనుమతుల నిమిత్తం రాగా, 432 ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించలేదని పేర్కొంది. ఈ కారణంగా భారత్ కు రావాల్సిన వందల కోట్ల పెట్టుబడులు నిలిచిపోయాయని గుర్తుచేసింది.