: ట్రంప్ పై మరో దెబ్బ... ఆదాయాన్ని ఇచ్చే 'తాజ్ మహల్' కేసినో మూత
తన కలల సౌధంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకునే కేసినో 'తాజ్ మహల్' మూతపడింది. దాదాపు 26 సంవత్సరాల క్రితం అట్లాంటిక్ నగరంలో ట్రంప్ ఈ కేసినోను ప్రారంభించగా, ఆయనకు అధికాదాయాన్ని తెచ్చేదిగా మారింది. ఇక కేసినోలో కార్మికులు, యాజమాన్యం మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడం, పలు విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోమవారం నాడు తాజ్ మహల్ కేసినోను మూసివేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ట్రంప్ మిత్రుడు, కేసినో పర్యవేక్షణ బాధ్యతలు భుజాన వేసుకున్న కార్ల్ ఐకాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. కార్మికుల వైద్యం, వారికి పెన్షన్ తదితరాల విషయంలో డీల్ కుదరని కారణంగానే కేసినో మూసివేత తప్పలేదని సమాచారం. జూలై 1 నుంచి దాదాపు 3 వేల మంది కార్మికులు సమ్మెలో ఉండగా, తాజా నిర్ణయంతో వారంతా ఉపాధిని కోల్పోయినట్లయింది. ఇదే తరహా సంక్షోభాలతో ట్రంప్ నడుపుతున్న నాలుగు కేసినోలు ఇప్పటికే మూతపడగా, ఇది ఆఖరుది.