: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు దుర్మరణం చెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చెన్నైకు చెందిన ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీరు మిత్రుల బృందం చిత్తూరు జిల్లాలో పలు పర్యాటక కేంద్రాలను దర్శించేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో తలకోనకు వెళుతున్నారు. అయితే, సిద్దక్క బావి మలుపు వద్ద వేగంగా వెళుతున్న వారి వాహనం ‘టవేరా’ టైరు పగిలిపోయింది. దీంతో, అదుపుతప్పిన వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ ఆనంద్ (28), రాజేష్ (27) తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మరో వాహనంలో వారి వెనుక వస్తున్న మిత్రులు ఈ సంఘటనను గుర్తించారు. ఆనంద్, రాజేష్ లిద్దరిని హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడికి చేరుకునే లోపు వాళ్లిద్దరూ మృతి చెందారని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎర్రావారి పాళెం ఎస్ఐ రవినాయక్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.