: కాలక్షేపం కోసం అడల్డ్ సైట్ కెళితే, 'ఫ్రెండ్' అంటూ రూ. 4 లక్షలు నొక్కేశారు!
ఆఫీసులో కాలక్షేపం కోసం అడల్డ్ వెబ్ సైటును ఓపెన్ చేసిన 50 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 4.05 లక్షలు నొక్కేసిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 'ఫ్రెండ్స్'తో చాటింగ్ సేవలను అందించే ఓ అడల్డ్ సైట్ ను బాధితుడు చూస్తున్న వేళ, కనిపించిన ఓ ఐడీతో చాటింగ్ మొదలు పెట్టాడు. కాసేపు కబుర్ల తరువాత, చాటింగ్ కొనసాగించాలంటే, రూ. 100 తమకు చెల్లించాలన్న మెసేజ్ కనిపించింది. దీన్ని 'ఎన్ వాలెట్ ఎకౌంట్'లో జమ చేసి, ఆపై ఎంత సేపైనా చాటింగ్ చేసుకోవచ్చని కనిపించింది. దానికి అంగీకరించిన బాధితుడు, తన బ్యాంకు ఖాతా నుంచి ఓటీపీ (వన్ టైం పాస్ వర్డ్) జనరేట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అదే సమయంలో అతని ఖాతా నుంచి రూ. 4.05 లక్షలు మాయమయ్యాయి. ఆపై సైబర్ నేరగాళ్లు అతనికి ఫోన్ చేసి, విషయాన్ని పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఈ కేసును త్వరలోనే పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.